52 సెకన్లే…’జనగణమన’ విషయమై తేల్చిన ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించడానికి ఉద్దేశించిన 1971నాటి చట్టం ప్రకారం- మన జాతీయ గీతం అధికారిక నిడివి 52 సెకన్లు. ఈ గీతాన్ని అంత సమయంలోనే పాడాలి.  ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇష్టం వచ్చినట్లు పాడుతూంటారు. ఈ విషయమై స్పష్టత కోసం RTIarchive.com ఫౌండర్, సామాజిక కార్యకర్త అయిన సత్య నరేష్ ప్రధాన మంత్రి కార్యాలయంకి RTI పిటీషన్  ఫైల్ చేసారు. అందుకు స్పందించిన కార్యాలయ సిబ్బంది…1971 నాటి చట్టంలో చెప్పబడ్డ 52 సెకన్ల  విషయాన్ని మరోసారి స్పష్టం చేసారు.

జనగణమన ని రవీంద్రనాధ్ ఠాగూర్ రచించారు. 1911లో మొదటిసారి పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 వ తేదీన జాతీయగీతంగా రాజ్యాంగసభ స్వీకరించింది. బాణీకి అనుగుణంగా ఈ గీతం  పూర్తిగా ఆలపించడానికి 52 సెకన్ల సమయం పడితే సంక్షిప్తంగా ఆలపించడానికి 20 సెకన్లు పడుతుంది. ఈ కాల పరిమితిలో  కాకుండా ఎవరిష్టం వచ్చినట్లు వారు పాడితే , అది నేషనల్ హానర్ యాక్ట్ 1971 క్రింద నేరంగా పరిణిగిస్తారు. దయచేసి ఈ విషయాన్ని గాయకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు గమనించి,గుర్తు పెట్టుకోవాలి.  52 సెకన్లు లోనే జాతీయ గీతాన్ని పూర్తి చేయాలి. జాతీయ గీతాన్ని గౌరవిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం.  జనగణమన గీతం బెంగాలీ భాషలో ఐదు చరణాల్లో రచించగా అందులోని తొలి ఎనిమిది లైన్లలను జాతీయగీతంగా తీసుకున్నారు. జనగణమన గీతం విశ్వకవి ఆత్మనే కాదు యావత్‌ భారతదేశాత్మను కూడా ప్రతిబింబిస్తుంది. జనగణమన పాడకుండా ఉద్దేశపూర్వకంగా నిరోధిస్తే లేదా ఈ గీతం పాడేందుకు గుమికూడినవారికి అవరోధాలు కల్పిస్తే మూడేళ్ల వరకు జైలుశిక్షకాని, జరిమానా కాని లేదా రెండూకాని విధించే అవకాశం ఉంది  .